Tuesday, April 22, 2008

Sundarakaanda 19th sarga

రావణుడచ్చటకేగిన తరుణము
కోమలి సీత భయము పెరుగగ
సుడి గాలి చిక్కిన అరటి చెట్టు వలె
బెదిరి పోయెను గజగజ వణికెను
చేతులు కాళ్ళను చెంతకు చేర్చి
తన కటియును స్థనములు మరుగు చేసి
భయం కలదై రోదన చేసెను 3

ఏడ్చెడి సీతకు చుట్టూచేరి
జాగరూకతో కావలి కాశెడి
వికృత రూపులగు రాక్ష మూకను
పర్యవేక్షణగ రావణుడు చూసెను 4

ఈదురు గాలికి విరిగిన కొమ్మలా
కటిక నేలపై వణుకుతు వుండి
దుమ్ము ధూళే భూషణమవగా
బురదలో మొలిచిన కమలము లాగ
మేని కాంతులకు నివురులు కప్పగ
మనోవేగముతొ రాముని చేరగ
వువ్విళ్ళూరే ఆశను కలిగి
హృదయము కరిగే విధముననేద్చుచు
ఒంటరిగ రక్కసుల నడుమ
ఆలోచనల వలలో చిక్కిన చేపల
మంత్ర బంధితమగు నాగ కన్యల
కేతు బారిన పడిన రోహిణివలె 9

మలిన పడిన చరిత వలెను
అపవాదు పడిన కీర్తి వలెను
మాటను పడిన నమ్మిక వలెను
భంగ పడిన ప్రజ్ఞ వలెను
రాలి పదిన కలువ వలెను

మకిలి పట్టిన విద్య వలెను
గ్రహణం పట్టిన చంద్రుని వలెను
వంచన పట్టిన కులము వలెను
మృత్యువు పట్టిన సైన్యము వలెను

సమసి పోయిన ఆశ వలెను
ఆరి పోయిన ప్రమిద వలెను
కరిగి పోయిన కలల వలెను
చెదిరి పోయిన వరుస వలెను

చీకటి మ్రింగిన వెలుగు వలెను
వేడిమి మ్రింగిన సెలయేరు వలెను
రాహువు మ్రింగిన చంద్రుని వలెను
అగ్నులు మ్రింగిన వేదిక వలెను

వేడికి వాడిన కలువల వలెను
ఏనుగు తిరిగిన కొలనుల వలెను
దీన వదనమున వగచెడి సీతను
ఆకుల మాటున చేరిన మారుతి
వికలిత మనమున తేరి చూసెను 18

సేవలు అందెడి కోమలి సీత
ఎండకు ఎండి మకిలి పట్టినది
త్రాటితొ కట్టిన గున్న ఏనుగువలె
వివిధ బాధలకు ఓర్చుచున్నది 19

వివిధ భూషణముల వెలిగెడి సీత
బాధకు నలిగి కరుడు కట్టినది
శీత కాలమున మోడై పోయి
ఆకులు రాలిన లతలాగున్నది 20

మచి సంపదతొ పెరిగిన సీత
పోషణ కరువై శుష్కించున్నది
బాధ భయమే భోజనమవగ
కంటికి నిదురే మరుగై వున్నది 21

రాక్షస బాధను తాళలేక
చేతులు మోడ్చి పైనకి చూస్తూ
రావణ వధకై అర్చన చేసే
దీన వనితవలె అగుపడు చున్నది 22

తోడు కొరకై అటునిటు చూచుచు
మాట పెగలక బాధగ ఏడ్చుచు
ఎరుపెక్కిన కనుల నీళ్ళను రాల్చెడి
సీతను చూస్తు, గర్జన చేస్తూ
భయము పెట్టుచు, ఆశలు చూపుచు
తన వసమిక అవమని రావణుడడిగెను 23